Tanakopame Tana Satruvu_తన కోపమే తన శత్రువు | Telugu Moral Stories

Tanakopame Tana Satruvu_తన కోపమే తన శత్రువు

 

మీరు పిల్లలు… మార్పు మీ దగ్గరే ప్రారంభం కావాలి. ప్రయత్న పూర్వకంగా కొన్ని మంచి లక్షణాలు పసి వయసులోనే అలవాటు చేసుకోవాలి. దీనికి ఉపకరించేవి పెద్దలు, గురువులు చెప్పే మాటలు.. అలాంటిదే శతక నీతి కూడా… ఇప్పడు మనం తెలుసుకుంటున్న ‘తన కోపమె తన శత్రువు…’ సూక్తి సుమతీ శతకం లోనిది.

 

మన కోపం ఎక్కువగా మనల్నే నష్టపరుస్తుంది, మనం ప్రశాంతంగా ఉంటే మనం నేర్చుకునే విషయాలపట్ల మనకు ఏకాగ్రత కుదురుతుంది. ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి… అంటూ మన సంతోషమే మనకు స్వర్గం, మన దుఃఖమే మనకు నరకం అంటారు బద్దెన గారు.

 

పోతన గారు ఓ మాటంటారు… ‘‘వ్యాప్తిం బొందక వగవక /ప్రాప్తంబగు లేశమైన బదివే లనుచుం/దృప్తిం జెందని మనుజుడు/ సప్తద్వీపముల నయిన? జక్కంబడునే?’’ అంటే…లభించినది కొంచెం అయినా అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు….అంటారు. ‘నన్ను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులున్నారు, నాకు మంచి స్నేహితు లున్నారు.

 

నేను మంచి పాఠశాలలో చదువుతున్నా. నాకు మంచి గురువులున్నారు..అలా మనకు ఉన్నవేవో వాటిలోని మంచిని తలుచుకుంటూ మన ప్రయత్నం, మన అభ్యాసం మటుకు నిజాయితీగా చేయాలి. ఇది చేయకుండా అంటే ఉన్నవాటిలోని మంచిని చూడకుండా… లేనివి ఏవో పనిగట్టుకుని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఉన్న పుణ్యకాలం గడిచిపోతుంది.

 

అలా నిత్యం దిగాలుగా ఉండి చేతిలో ఉన్న సమయాన్ని కూడా వృథా చేసుకునేవాడిని ఆ దేముడు కూడా కాపాడలేడు. నిన్ను సంతోషంగా కానీ దుఃఖంతో కానీ ఉంచేది నీ మనసే. దానిని అదుపు చేసుకో, దానికి నచ్చ చెప్పు. దాని మాట నీవు వినడం కాదు, నీ మాట అది వినేటట్లు చేసుకో. అది నీ చేతిలో ఉంది. అది ఇతరుల వల్ల సాధ్యం కాదు. అలా ఆలోచించి నిత్యం తృప్తిగా, సంతోషంగా ఉంటూ పనులు చక్కబెట్టు కుంటుంటే అదే నీకు స్వర్గం. మీకొక రహస్యం చెబుతా. మనం అందరం చెప్పుకునే స్వర్గలోకం శాశ్వతం కాదు.. మనం చేసిన మంచి పనుల వల్ల మనం స్వర్గం చేరుకునేది నిజమే అయినా… అది మన ఖాతాలో పుణ్యం ఉన్నంతవరకే.

 

అది అయిపోగానే … మనం పడిపోతాం. కానీ ఇక్కడ ఈ మనుష్య జన్మ నీకు దక్కింది… 84 లక్షల జీవరాశుల్లో దేనికీ దక్కని అదృష్టం వల్ల నీకు దక్కిన ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే … నీవు దొరికిన దానితో తృప్తిపడి… నిత్యం సంతోషంగా ఉంటే… నీ జీవితాంతం అలా ఉండగలిగితే… ఇక్కడే నీకు స్వర్గ సుఖాలు లభించినట్లు. అలాకాక నా స్నేహితుడు మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతున్నాడు, నేను కాలేకపోతున్నా… అని తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే… నీ నరకాన్ని దేముడు కాకుండా నీవే సృష్టించు కున్నట్లయింది. జన్మజన్మలకూ నీవు కూడా సంతోషంగా ఉండాలంటే, నీకు కూడా నీ స్నేహితుడి లాగా సరస్వతీ కటాక్షం పొందాలంటే.. కష్టపడు, బాగా చదువు.

 

ఈ జన్మలో నీకు వచ్చిన విద్య పదిమందికి పంచు, కష్టంలో ఉన్నవాడికి నీకు చేతనయినంత సహాయం చెయ్యి. నిత్యోత్సాహంతో ఉండు. ఫెయిల్‌ అయ్యావు… అంత మాత్రానికే లోకం తల్లకిందులయిపోయినంతగా దిగాలు పడొద్దు… అబ్దుల్‌ కలాం గారు.. ఎఫ్‌.ఎ..ఐ.ఎల్‌..ఫెయిల్‌ అంటే ఫస్ట్‌ అటెంప్ట్‌ ఇన్‌ లెర్నింగ్‌… అన్నారు. అంటే నీవు నేర్చుకోవడానికి నీవు చేసిన మొదటి ప్రయత్నం అది అన్నారు.. ఇప్పుడు నీవేం చేయాలి.. రెండో ప్రయత్నం. పట్టుదలతో, ఏకాగ్రతతో సాధించు… అంతే తప్ప నీ అరచేతిలో నీవు సృష్టించుకోగలిగిన స్వర్గాన్ని నీవే కిందకు నెట్టేసి నరకాన్ని చేతులారా తెచ్చిపెట్టుకోవద్దు.

Home Page    Learn Telugu    Learn English    YouTube Videos    Telugu Moral Stories

Telugu Christian Songs Lyrics     Computer Shortcut Keys

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!