Bhavanaku Balamundi(భావనకు బలముంది) | Telugu Moral Stories

భావనకు బలముంది

 

సంఘటన బహిరంగం. భావన అంతరంగం.

 

ఈ రెండూ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపించడం సహజం, సంఘటనను అంచనా వేయడమో, అనుభవించడమో చేయగలం- కానీ పూర్తిగా మార్చగలగడం మనవల్ల అవుతుందా! అన్ని సందర్భాల్లోనూ కుదరదేమోగానీ; తగిన ప్రణాళికలతో, ప్రయత్నాలతో కొన్నిటినైనా మలచగలం, మార్చగలం అనడంలో సందేహించనక్కర్లేదు. జరగబోయేవి మన చేతుల్లో లేవు- అనడం నిజం కావచ్చు. కానీ ‘సద్భావన’తో వాటిని ప్రయోజనకరంగా పరిణమింపజేయగలం- అని శాస్త్రాలు రుజువు చేస్తున్నాయి.

 

భావనలో సలక్షణం ఉంటే- 1. సంఘటన తీవ్ర ప్రభావం చూపించకపోవచ్చు, 2. లేదా, అది తప్పిపోవచ్చు, 3. దాన్ని తట్టుకొని, సానుకూలంగా మలచుకొనే సమర్థత పొందవచ్చు. అందువల్లనే భావనను బలపరచే సాధనలు మనకు సూచించారు మహర్షులు. ధ్యానం, తపస్సు, క్రమబద్ధమైన జీవితం… భావనకు బలాన్నిస్తాయి. సంకల్ప సిద్ధులు కావడమంటే ఇదే.

 

‘భావనాయోగం’ అనే దివ్యప్రక్రియను కొన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల్లో వివరించారు. ఒక యోగంగా అభ్యసిస్తే భావనను కళ్లముందు సత్యంగా సాక్షాత్కరింపజేయవచ్చు- అని శాస్త్రనిరూపణ. ఆధ్యాత్మికసిద్ధికి భావనే ఆధారసూత్రం. ‘చిత్తంకొద్దీ శివుడు-విత్తం కొద్దీ వైభవం’ అనీ సామెత. భౌతికరంగంలోనూ ఈ భావనాబలం పనిచేస్తుంది.

 

జీవితంలో అనుబంధాలు, అనుభవాలు భావంతో అల్లుకున్నవే. ఏకాగ్రచిత్తంతో, యోగశాస్త్రపద్ధతుల్లో తపశ్శక్తితో భావనను దృఢపరిస్తే దేనినైనా సాధ్యం చేయవచ్చు… అని ధైర్యాన్నిస్తున్నాయి. దానికి ఎన్నో తార్కాణాలు నేటి యుగంలోనూ చూడవచ్చు. ఎల్లవేళలా సానుకూల సకారాత్మక భావన కలిగి ఉండి, దాన్నే వ్యక్తీకరించేవాడు తప్పకుండా విజయాలు సాధించగలడు. స్వప్నాలను సత్యం చేసుకోగలడు, ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు ‘ఇది నేను చేయగలను- చేసి తీరతాను’ అనే దృక్పథం ఉన్నప్పుడు ఆ పని దాదాపు సిద్ధించినట్లే. ఈ సద్భావన ఇచ్చే బలం ఏ అవరోధాన్నైనా ఎదుర్కొనేలా చేస్తుంది. ఈ విధానమే ‘శుభాకాంక్షలు’లో ద్యోతకమవుతుంది.

 

దీవెనలు, ఆశీర్వచనాలు, ప్రార్థనలు… ఇవన్నీ శుభాకాంక్షలే. పెద్దలు మనసారా పలికే దీవెనలు, శుభాన్ని ‘ఆశించి’ చెప్పే ఇతరుల ఆశీస్సులు, భగవచ్ఛక్తిని ఆరాధిస్తూ మనకోసం, ప్రపంచం కోసం ప్రసరించే మంచి భావాల ప్రార్థనలు… ఇవన్నీ ప్రాచీనకాలంనుంచి మనదేశంలో సంప్రదాయాలు. పర్వదినాల్లో, కార్యారంభాల్లో, శుభకర్మల్లో ఈ ఆనవాయితీ నేటికీ ఉన్నది.

 

ముఖ్యంగా కాలం మలుపుల్లో శుభకామనను వ్యక్తపరచడం మానవ స్వభావం. అందుకే దేశాలేవైనా, మత, సంస్కృతులేవైనా అందరూ వారి కాలమానాల ప్రకారం- ఏడాదంతా ఆనందమయం కావాలని కోరుకుంటారు. ‘ఈ సంవత్సరంలో జరిగే మార్పులన్నీ శుభకరంగా ఉండాలి…’ అంటూ ప్రపంచంలోని ప్రథమ వాఞ్మయమైన వేదంలోనే కనబడుతోంది.

 

నూతన సంవత్సర శుభాకాంక్షలను వేదం తొలిసారి పలికింది. జరగబోయే చెడు ముందే తెలిసినా, సద్భావంతో కాలాన్నే మార్పుచేసిన వైనాలు మన పురాణాల్లో కోకొల్లలు. తన భర్త సత్యవంతుడు కొద్దికాలంలో మరణిస్తాడని తెలిసీ నిబ్బరంగా నిలబడింది సావిత్రి. నిజానికి వివాహానికి పూర్వమే ఆమెకు తెలుసు. కానీ ధైర్యంగా, తన ప్రేమకు ప్రాధాన్యమిచ్చి పెళ్లాడింది. తనకు తెలిసిన నిజం భర్తకు చెప్పలేదు. తాను తపస్సాధనను కొనసాగిస్తూ, తన భర్తకు ఆయువు పెరగాలనే సద్భావాన్ని కేంద్రీకృతం చేసింది. సద్భావాన్ని విశ్వాసంతో, ఏకాగ్రంతో బలపరచడమే కదా తపస్సు! దాని ఫలితంగా కాలం (కాలుడు = యముడు) ఆమెను అనుగ్రహించింది, అనుకూలపడింది.

 

జరగబోయే దుస్సంఘటనను తప్పించగలిగింది. మానవుడు తన సద్భావనాబలంతో దేన్నైనా సాధించగలడనడానికి ఇదో తార్కాణం! ‘నేను లంకకు వెళ్లి సీత జాడ తెలుసుకొని తీరతాను’ అనే సద్భావనను సమర్థంగా సత్యంచేశాడు హనుమ. సీతమ్మకు ఆ శుభభావనను ప్రసరించి ధైర్యాన్నిచ్చాడు. అరణ్యవాస సమయంలో ధర్మరాజు వద్దకు వచ్చిన అనేకమంది రుషుల దీవెనల్లోంచి ఈ సద్భావన శుభాకాంక్షలుగా వెలువడి శుభాన్నే కలిగించింది.

 

శుభాన్ని ఆకాంక్షించడం ఎన్నడూ వ్యర్థం కాదనేది- సారాంశం. వ్యర్థంకాని విధంగా ఆకాంక్ష తెలపాలంటే ఆ తెలిపే చిత్తంలో నిజాయతీ, శుద్ధి ఉండాలి. అప్పుడది అమోఘమవుతుంది, ఫలవంతమవుతుంది. సద్భావన స్వభావమైతే ప్రభావం తప్పక ఉంటుంది.

 

Home Page    Learn Telugu    Learn English    YouTube Videos    Telugu Moral Stories

Telugu Christian Songs Lyrics     Computer Shortcut Keys

 

–సామవేదం షణ్ముఖశర్మ |

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!